Wednesday, May 6, 2020

హే రామానుజ !


                                                     హే రామానుజ !
                             (నామమమొక్కటే స్వస్వరూప జ్ఞాన కైంకర్యములు మూడు)                                                       
భగవంతునికి ప్రీతికల నామము, లోకోజ్జీవనమునకై మంచి మార్గము చూపు నామము, ఆచార్య పదవికే వన్నెతెచ్చిన నామము “రామానుజ” అను నాలుగు అక్షరముల నామము (చతురా చతురక్షరీ), అన్నికోర్కెలను తీర్చు నామము.
      
                                      నచేద్ రామానుజేత్యేషా చతురా చతురక్షరీ
                                కామవస్థాం ప్రపద్యంతే జంతవో హన్త! మాదృశః

సంసారమనే వ్యాధికి సరైన మందు “రామానుజ” అనే నామమే. “సంసార రోగ శకలీకరణౌషధాని”
“రామానుజ” అనే నాలుగు అక్షరములు పలుకుతూ ఉంటే నాలుక అమృతమయమవుతుంది. సాక్షాత్తు భగవంతుడే వరమిచ్చాడుట “రామానుజ”అని పలికితే చాలు అన్ని కోరికలు తీరుస్తాను అని. ఆర్తితో నేను నీ వాడిని నీ పాదదాసుడను అని మనస్పూర్తిగా పలికితే చాలుట మోక్షమును కూడా ఇస్తాడుట ఆ భగవంతుడు.
ఇందుకు తగిన ఐతిహ్యాలు, “రామనుజులు” వేంచేసియున్న కాలములో జరిగిన విశేషములు చాలా ఉన్నాయి. భగవంతుడు వాత్సల్య గుణ సంపన్నుడు, దయా హృదయుడు, లోకోజ్జీవనముకై లోకకళ్యాణార్ధమై అనేకావతారాలు ఎత్తిన భక్త సులభుడు. ఈ జీవులు ఏదో ఒక విధముగా, ఎలాగైన నన్ను తలిస్తే చాలు అని ఎదురుచూసే కరుణాసాగరుడు.
                                                
ఆయన ఎన్ని అవతారములు ఎత్తినా మనలో కొంతమంది మూర్ఖులు ఆయనను గుర్తించక ఆయన పేరు కూడ తలవక తెలిసి తెలియక చేసిన పనుల వలన మళ్లీ మళ్ళీ ఈ సంసార చక్రములో (పుట్టడం, ఎదో ఒక జన్మ ఎత్తడం, పెరగడం, బాధలు అనుభవించడం, మరణించడం, మళ్ళీ జన్మ ఎత్తడం, మళ్ళీ మరణించడం, ఇదే సంసార చక్రం అంటే ఇందులో) పడి ఉండడం చూసి కనీసం నా పేరు కూడా తలవడం లేదు అని జాలితో పోనీ అంకెల రూపంలో నైనా నన్ను తలచుకుంటున్నాడు అని అనుకుంటారుట.
అవి ఎలా అంటే తత్వములు 24, ఆత్మ 25, పరమాత్మ 26, 26 అనగానే ఒకసారి నన్ను తలచుకున్నాడు అని అనుకుంటాడుట భక్త వత్సలుడైన శ్రీమన్నారాయణుడు.అలా అంకెలలోనే ఆయనను పిలిచినట్టు తృప్తి పడుతుంటే ఆయన అనుగ్రహించిన (వరములిచ్చిన) “రామానుజ”అనే నామము పలికితే ఇక చెప్పనవసరం ఏముంది.సాక్షాత్తు ఆ పరమపదనాథుడే అనంతులను పిలిచి నీవు భూలోకానికి వెళ్ళి,భాగవతోత్తముడిగా,
ఆచార్యునిగా జీవులని ఉద్ధరించి మంచి మార్గమును చూపి శాశ్వతానందాన్ని అనుభవింపచేయి నాయనా అని ఆజ్ఞాపించి భూలోకానికి పంపించారుట. 
                                  ఆదౌ జగదాధార శ్శేషః
                                         తదను సుమిత్రానందన వేషః
                                      తదుపరి ధృతహలముసల విశేషః
                                       తదనంతర మభవత్ గురు రేషః                                    
ఈ యతిరాజులే మొదట జగత్తునకు ఆధారభూతుడైన ఆదిశేషుడిగను, పిమ్మట లక్ష్మణుడుగను,తరువాత నాగటిని, రోకటిని ధరించిన  బలరాముడుగను,  అటుపిమ్మట ఈ గురువుగాను “రామానుజల” గాను అవతరించిరి.

విశేషమేమిటంటే “రామానుజ” అనే నామము ఒక్కరిని పిలిచినట్టు మాత్రమే కాదు “రామానుజ” అనగానే ఆదిశేషుడైన మొట్టమొదటి భగవద్దాసుడు అయిన ఆనంతులు పలుకుతారు. పెరుమాళ్ళు కూడా అనంతుల్ని ఎవరో పిలిచారు అంటే వారు అనంతులకు సంబంధీకులు అయితే నాకు సంబంధీకులే అని అనుకుంటారుట, వారి రక్షణ కూడా ఆ స్వామియే తీసుకుంటారుట.

శ్రీ కృష్ణుడు గోపబాలురలలో ఈయన స్నేహితులే కాకుండా స్నేహితుల స్నేహితులని కూడా ఆదరించినట్టు.అలాగే “రామానుజ” అనగానే త్రేతాయుగంలో అవతరించిన లక్ష్మణ స్వామి పలుకుతాడుట. రామునికి సోదరా అని పిలిచాడు అని నా అన్నగారి సంబంధముతో నన్ను పిలిచారు అని సంతోషించి పలుకుతారుట. రాముని సాయం కోరి వచ్చిన వారికి నేను రక్షగా ఉంటాను అని ముందుకు వెళ్లినట్టుగా“రామానుజ” అనగానే లక్ష్మణుడు పలుకుతాడుట,ద్వాపర యుగములో పరిపూర్ణ అవతారమైన అఘటితా ఘటనా చేష్టితములు చేసినవాడు, బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతల స్తోత్రములుచే సంతోషించిన వాడు, జగద్రక్షకుడు, లోక కళ్యాణం కోసం అవతరించిన భక్త సులభుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ పలుకుతాడుట, బలరామునికి అనుజుడుగా వేంచేసి ఉన్నాడు కనుక “రామానుజ” అనగానే శ్రీ కృష్ణ భగవానుడు పలుకుతాడుట.

“రామానుజ” అనే నామము తలిస్తే కలియుగం లో అర్చామూర్తి గా వెలసిన ఆ శ్రీమన్నారాయణుడికే ఆచార్య స్థానమును అలంకరించిన వారు ఉభయ విభూతి నాయకులు అయిన “భగవద్రామానుజులు” పలుకుతారుట.   

ఈ జీవులను మోక్ష మార్గమున పయనింప చేసి ఈ లీలా విభూతి నుండి ఆ నిత్య విభూతికి (పరమపదమునకు) 

తీసుకుని వెళ్లి శాశ్వత ఆనందమును, భగవత్ కైంకర్యమును నిత్యము చేసుకునేలా ఉభయ విభూతి నాయకులుగా 

వేంచేసి ఉన్న “భగవద్రామానుజులు” పలుకుతారుట. ఏ విధంగా చూసిన “రామానుజ” అనే నాలుగక్షరముల 

నామము ఇహ (ఈ లోకములో), పర(పర లోకములోను) సౌఖ్యములకు కారకము. ఈ ఉభయ విభూతి 

నాయకత్వము సాక్షాత్తు శ్రీరంగనాథుడే “రామనుజులకు” అప్పచెప్పారట. 

అలాగే “రామానుజ” అనే నామము అన్ని కోర్కెలు తీర్చడమే కాదు ఈ జీవుని స్వరూపమును తెలుపు 

భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం ఏదైతే ఉందో దానిని వాఛికముగా చేసుకున్నట్టే. భగవంతుడిని ఆరాధిస్తే 

ఆచార్యులు భాగవతోత్తములు సంతోషిస్తారట. ఆచార్యులను ఆరాధిస్తే భగవంతుడు భాగవతోత్తములు 

సంతోషిస్తారట. భాగవతోత్తములను ఆరాధిస్తే ఆచార్యులు, భగవంతుడు సంతోషిస్తారట.ఈ మూడు విధములైన 

కైంకర్యములు ఒక్కటే, ఒకటి లేకపోయినా మిగిలినవి ఉండవు. నేను భగవంతుడినే ఆరాధిస్తాను, మిగిలిన వాళ్ళు 

అక్కరలేదు అంటే ఆచార్యులు భాగవతోత్తములు సంతోషించినా భగవంతుడు ప్రీతి చెందడుట.                                                                                                                           
ఇది ఎలా అంటే ఒక శరీరం నిలబడడానికి (జీవించడానికి) పీల్చే గాలి,త్రాగే నీరు, భుజించే పదార్ధములు మూడు ఏలాగైతే ముఖ్యమో శరీరానికి పుష్టిని కలిగిస్తాయో అలాగే భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం ఈ మూడు కలిస్తేనే అంటే ఇలా కైంకర్యం చేసుకుంటేనే భగవంతుడు ప్రీతిచెందుతాడు.
ఈ మూడు కలిపి కైంకర్యముగా లభించినదే “రామానుజ” అనే ఒక్క నామము పలికితే వాఛికముగా మూడు కైంకర్యములు చేసుకున్నట్టే భగవంతుడు భాగవతోత్తములు సంతోషించినట్టే. అలాగే “రామానుజ” అనే నామము జ్ఞానం కల ఈ ఆత్మకు భగవంతుని చేరు మార్గమును చూపించి శాశ్వతానందాన్ని నిత్య కైంకర్యమును కలింగింపచేస్తుంది.
మనందరి ఆలోచనలు మనకి కష్టాలు తొలగాలి సుఖాలు కలగాలి అందుకు భగవంతుడిని ప్రార్ధించాలి ఆయన్ని సంతోషపరచాలి ఆయనకు సంభంధించిన పూజలు అవి చేయాలి అనుకుంటాము.కాని ఆయనకు సంభందించిన కల్యాణ గుణములను కీర్తించడం ఎంత ముఖ్యమో అలానే ఆచార్యపురుషులను, భాగవతోత్తములను గౌరవించడం, ఆరాధించడం, ఆదరించడం కూడ అంత ముఖ్యం ఇందుకు తగిన ఐతిహ్యములు చాలా ఉన్నాయి.
                          సిద్ధర్భవతి వా నేతి సంశయో౽చ్యుతసేవినామ్ |
                      న సంశయో౽స్తి తద్భక్తపరిచర్యారతాత్మనామ్||
అని ప్రమాణము దీని  అర్థం ఏమిటంటే ఆ అచ్యుతుడిని (శ్రీమన్నారాయణుడిని) ఆశ్రయించినవారికి సద్గతి ప్రాప్తి సిద్ధించునో లేదో (మన కర్మలననుసరించి) సందేహమే కానీ  తద్భక్తులైన భాగవతులను ఆశ్రయించిన వారికి  అటువంటి సందేహము కలుగనే కలుగదు  అని అర్ధం. అంటే భాగవతోత్తములంటే అంత ప్రీతి భగవంతుడికి.                       
·       భాగవతోత్తములు అయిన గజేంద్రుడుని భాదించినందుకు మొసలిని సంహరించాడు.
·       భాగవతోత్తములు అయిన అంబరీషునిపై ఆగ్రహించిన దూర్వాసుడిని తరిమి తరిమి భయపెట్టి మరీ బుద్దిచెప్పాడు. (దూర్వాసుడు తాపసి కనుక భయపెట్టి బుద్ది చెప్పి వదిలేసాడు).
·       సీతాదేవిని బాధించినందుకు కాకాసురుడిని సంహరింపచూసాడు కాని సీతాదేవి పురుషకారము వలన (సీతాదేవి క్షమించి వదలమని ప్రార్ధించడం వలన) సంహరించకుండా ఒక కన్ను మాత్రము తీసేసి క్షమించి వదిలేసాడు.
·       భాగవతోత్తముడు అయిన లక్ష్మణుడిని గుర్తించనందుకు సుగ్రీవుడికి దేహశుద్ధి చేయించాడు.
·       భాగవతోత్తములు అయిన ఋషులను,దేవతలను బాధించినందుకు రావణాసురుడిని సంహరించాడు.
·       భాగవతోత్తములను హింసించేందుకు సహకరించిన కుంభకర్ణాది రాక్షసులను సంహరించాడు.
·       భాగవతోత్తములు అయిన కుంతిదేవిని, ద్రౌపదిని, పాండవులను బాధించినందుకు మొత్తం కురువంశమునే నసింపజేసాడు.
v ఇక మనం ఉన్న కలియుగములో అయితే చెప్పలేనన్ని విశేషాలున్నాయి.
·       పరమ భాగవతోత్తములు ఆచార్య స్థానీయులు అయిన ఆళ్వార్లను అర్చామూర్తిగా (దివ్య దేశములో వేంచేసియున్న స్వామిగా) వేంచేసి సేవ సాయించాడు (ఆళ్వారులు ఉన్నచోటికి స్వామియే వెళ్ళి దర్శనం ఇచ్చాడు) .  
·       అలాగే భాగవతోత్తముడు అయిన తొండమాను చక్రవర్తికి వచ్చిన ఆపద నుండి రక్షించుటకు వేంకటేశ్వరుడు భక్తులకు అలంకారమగు వస్తువులుగాను, శత్రువులకు భయమునొందించు ఆయుధములుగాను కనిపించు శంఖ చక్రములను ఆ చక్రవర్తికి ఇచ్చి ఆపదను తొలగించాడు.
·       అలాగే పరమ భాగవతోత్తములు, ఆచార్య పురుషులు అయిన భగవద్రామానుజులను ఆచార్యులుగా స్వీకరించారు దివ్య దేశములలో అర్చామూర్తిగా వేంచేసిన శ్రీమన్నారాయణుడు .
·       తిరుమల వేంకటేశ్వరుడుకి శంఖ చక్రములు సమర్పించి ఆచార్యులైనారు. ఈ వేంకటేశ్వరుడే  “రామానుజుల” మూర్తిని (తిరుమల)ఆలయములోనే ఎత్తైన స్థానములో వేంచేసి ఉండేలా అర్చకులను  ఆజ్ఞాపించాడు.
·       అలాగే తిరుక్కరుంగుడి నంబికి మంత్రోపదేశం చేసి వైష్ణవ నంబిగా చేసి ఆ స్వామికి ఆచార్యులు అయినారు.
·       సాక్షాత్తు రంగనాథుడే అనుగ్రహించిన ఉభయ విభూతి నాయకత్వమును “రామానుజుల” యొక్క గొప్పతనము లోకము నంతటికి తెలియపరుచుటుకే “రామానుజుల” చిన్నతనంలోనే (యాదవ ప్రకాశులు వద్ద విద్యనభ్యసించే సమయములో)రాజకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు “రామానుజుల”(లక్ష్మణార్యులు)పాదం నా శిరస్సు మీద ఉంచితే నేను వెల్లిపోతాను అని చెప్పి “రామానుజుల” శ్రీపాద స్పర్శతో బ్రహ్మరాక్షసుడు అక్కడ నుండి వెళ్ళిపోయేలా “రామానుజుల”శ్రీ పాద మహిమను లోకానికి తెలియచేసాడు స్వామి.                                            
·     శ్రీరంగం లోని చంద్రపుష్కరిణిలోగల జలచరములకు (చేపలకు) మోక్షాన్నిఇచ్చేలా చేసాడు.
·    “రామానుజులు” తిరుమలలో వేంచేసి ఉండగా పాలు పెరుగు తీసుకు వచ్చిన తుంబియార్ కొండి యను గొల్లకి, ఈమెకు మోక్షము ఈయవలెను అని ఒక చీటి వ్రాసి “రామానుజులు” అని సంతకం పెట్టి ఇచ్చినందుకు తిరుమలపై వేంకటేశుని గా వేంచేసిఉన్నస్వామి ఆచార్యుల ఆజ్ఞ అని వెంటనే
ఆ గొల్లకు మోక్షమిచ్చి “రామానుజుల” (ఆచార్యుల, నామ) వైభవమును చాటినారు.
·    అలాగే సింహాచలనాథుడైన వరాహలక్ష్మీనృసింహస్వామి ఆంతరంగ భక్తుడైన కృష్ణమయ్య మోక్షమడిగితే,

మోక్షము కావాలంటే “రామానుజులను” ప్రార్ధించాలి అని నిష్కర్ష చేసి “రామానుజ”(నామ) వైభవమును 

లోకమునకు తెలియచేసారు.

·    శ్రీకూర్మ క్షేత్రములోని శ్రీ కూర్మనాధుడు “రామనుజుల” మాటను ఆచార్య ఆజ్ఞగా భావించి “రామానుజులు” తూర్పుదిక్కుకు చూచుచున్న స్వామిని పశ్చిమ దిక్కుకు తిరగమని చెప్పగ, “రామానుజులు” చెప్పినట్టుగా స్వామివారు పశ్చిమ దిక్కుకు తిరిగి సేవసాయించినారు
(దర్శనము ఇచ్చెను).
·     మేల్కొట లోని ఉత్సవర్లు శెల్వపిళ్ళై డిల్లీ నవాబు కోట లోని బీబి అంతఃపురం లోఉన్నారని తెలిసి “రామానుజులు” అక్కడికివెళ్ళి ఉత్సవర్లను శెల్వపిళ్ళా అని పిలవగానే తప్పిపోయిన పుత్రుడిని వెతుకుతున్న తండ్రి ఫలాని చోట తన పుత్రుడు ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్ళి   పిలవగానేతండ్రిమాట చెవిని పడగానే పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా,ఈ ఉత్సవర్లు “రామనుజులు” పిలవగానే తొడమీదకొచ్చి నిల్చున్నారుట. ఆచార్యులకు శిష్యులందరు పుత్ర (పుత్రిక) సమానులు కనుక ఉత్సవర్లను పేరుపెట్టి పిలవగానే చిన్నపిల్లాడివలె వచ్చేసారుట.
అలా ఆచార్యుల “రామానుజుల” వైభవమును ప్రకాశింపచేసారు పెరుమాళ్ళు.

·     పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు  ఎత్తిన పరిపూర్ణావతారమైన కృష్ణావతారమందు అఘటితఘటనా చేష్టితముల వలన బ్రహ్మకు మాయ తొలగించి శ్రీ కృష్ణుని కీర్తించునట్లు చేయుట వలన, గోవర్ధనోద్దరణ సమయంలో ఇంద్రునికి గర్వభంగముచేయుట వలన, వ్రేపల్లె వాసుల రక్షణ, పాండవుల రక్షణ చేయుట వలన, పలుమార్లు విశ్వరూపాన్ని దర్శింప చేయుట వలన, ఉషా అనిరుద్ధుల విషయములో బాణుడికి యుద్ధమందు సాయంవచ్చిన రుద్రుడు మరియు ఆయన భూత గణాలపై కృష్ణుడువిజయం సాదించుట ,మొదలగు జగత్కల్యాణ గుణముల వలన జగత్కారకుడైన భగవంతుడని.
·   అలాగే  భ గవద్భక్తులైన సుధాముడు,కుంతీదేవి,ద్రౌపది, విదురుడు, మొదలగు వారిని గౌరవించడం, ఆదరించడం, అటువంటి వాటి వలన పరమ భాగవతోత్తముడని.
·   అర్జునుడికి గీతోపదేశం చేయుట వలన, ఆచార్యుడని.
·   ఇలా పరిపూర్ణావతారుడైన శ్రీ కృష్ణుడు భగవత్ భాగవత ఆచార్యుడిగా వేంచేసి ఉన్నాడు.
·   మళ్ళీ అలా భగవత్ కల్యాణగుణములతో, భాగవతోత్తముల సుగుణములతో, ఆచార్య లక్షణములతో వేంచేసి ఉన్నది “భగవద్రామానుజులే”. 
·   భగవదనుగ్రహము వలన ఉభయ విభూతి నాయకత్వము వలన, ఈ లోకములో సుఖముగా జీవించేలా, రాజకుమార్తెలకు బ్రహ్మరాక్షసుడి బాధని తొలగించి సుఖముగా జీవింప చేయుట,       ఆ తరువాత పరమపదమునకు చేరి శాశ్వతానందమును, అనుభవించేలా, మోక్షకారకుడిగా, జలచరములకు మూగవానికి, తుంబియార్ కొండి అను గొల్లకు మోక్షం ఇప్పించుట వలన, భగవత్కల్యాణ గుణములు కలిగిన ఉభయ విభూతి నాయకుడిగా వేంచేసియున్నారు.
·   తిరుక్కచ్చినంబి లాంటి భగవద్భక్తులు,పరమభాగవతోత్తములను ఆచార్య సమానులుగా చూచుట,ఆచార్యుని కుమార్తెను చూసి నీళా పిరాట్టిలా భావించి సాష్టాంగప్రణామము చేసిన తీరుననుసరించి, పిల్లలు సరదాగా పెరుమాళ్ళు  ప్రసాదములు అని ఆటలు ఆడుకొంటూ అటుగా వెళుతున్న “రామానుజులను” చూసి ఇసుకని తీసి ఇది పెరుమాళ్ళ ప్రసాదము అనగానే తీసుకుని కళ్లకు అద్దుకొనిని విధానమును బట్టి, ఇంకను అనేక విశేషములవలన భగవంతుడిని కీర్తించిన భక్తులయందు గౌరవ ఆదరములు కలిగిన పరమ భాగవతోత్తముడిగా.
·   అలాగే నమ్మాళ్వార్లు నాధమునులకు “రామానుజులు” అవతరించక ముందే భవిష్యదాచార్యులు వీరే ఈ జీవులను ఉద్ధరించుటకై త్వరలో ఈ భూమిపై అవతరిస్తారు అని “రామానుజులs”వారి మూర్తిని (విగ్రహం) నాధమునులకు ఆ మూర్తిని అనుగ్రహించి పరంపరగా వీరిని అందచేయండి అని ఆజ్ఞాపించారు.ఈ విశేషము వలన లోకోజ్జీవనముకై వేంచేసిన ఆచార్యులు అని తెలియచున్నది.
సాక్షాత్తు కంచి వరదరాజస్వామియే “రామానుజులు” అడగకముందే “రామానుజుల” మనసులోని భగవంతునికి భక్తులకు సంబంధించిన సందేహాలను అంటే ? ఎవరు భగవంతుడు? ఆయనను చేరి శాశ్వతానందాన్ని ఎలా పొందాలి ? అనేటటువంటి సందేహాలను తీర్చిన విధానముననుసరించి, జీవులు మోక్ష మార్గమున పయనించేలా భగవత్కల్యాణ గుణ వైభవములను తెలియచేయుట, అందరూ ఉజ్జీవించాలని “నారాయాణాష్టాక్షరి” మంత్రోపదేశములు అనుగ్రహించుట వలన, భక్తులకు సన్మార్గము చూపు భోదనలు చేయుటవలన,దివ్యదేశములలో వేంచేసిన స్వామికి శంఖ చక్రములు సమర్పించుట వలన,ఉపదేశము చేయుట వలన, ఇలా భగవత్ భాగవత ఆచార్యునిగా వేంచేసి ఉన్నారు అని తెలియచున్నది.
అందుకే వేదాంత సారాన్ని, భగవతత్త్వాన్ని సంపూర్ణముగా తెలిసిన గొప్ప గొప్ప పండితులు “రామానుజ స్వామిని” ఇలా మంగళమ్ కలగాలని కీర్తించేవారు కీర్తిస్తున్నారు. 
                              శేషో వా సైన్యనాథోవా  శ్రీపతి ర్వేతి సాత్వికైః
                           వితర్కాయ మహాప్రాజ్ఞైః  భాష్యకారాయ మంగళమ్.
గొప్ప ప్రజ్ఞను కల సాత్వికులచే వీరు ఆదిశేషులా?  లేక విష్వక్సేనులా?  కాకపోతే
శ్రియఃపతి యేనా? అని ఒక్కొక్కరిచే ఒక్కొక్కరీతిలో గొప్పగా వర్ణింపబడు భాష్యకారులకు మంగళమ్.

భగవంతుడికి “రామానుజులు” అంటే ఎంత గౌరవాభిమానములో ఎందుకంటే నంబెరుమాళ్ ఒక సమయములో పూర్వాచార్యులు అయినా తిరువరంగత్తముదనార్ అను భాగవతోత్తములు ఒకరు (వీరున్న సమయములో శ్రీరంగ ఆలయ ధర్మకర్తగా కూడా ఉన్నారు) వీరితో నంబెరుమాళ్ ఒక రోజు “రామానుజుల” వైభవాన్ని తెలిపేలా ఒక ప్రబంధాన్ని వ్రాయరాదా అని ఆజ్ఞాపించగా అముదనార్లు “రామానుజుల” వైభవాన్ని తెలిపేలా “రామానుజ” నామాన్ని 108 సార్లు పలికేలా భగవంతుడి యందు, భాగవతోత్తములు అయిన ఆళ్వార్లు, ఆచార్యుల యందు వారు అనుగ్రహించిన గ్రంథముల యందు “రామానుజుల”కు ఎంత గౌరవాదరాభిమానములు ఉన్నవో తెలియపరుస్తూ అటువంటి “రామానుజుల”ను ఆశ్రయిస్తే ఇహలోక సౌఖ్యములు తప్పక కలుగుతాయి అని.

భగవంతుడను అనుగ్రహించినట్టు “రామానుజులే” మనకు రక్ష అని స్వస్వరూప జ్ఞానం తెలియపరుచు విధముగా “ఇరామానుజ నూత్తందాది” అను 108 పాశురములు గల ఒక దివ్య గ్రంధమును రచించిరి . ఈ గ్రంథమును తీసుకెళ్ళి నంబెరుమాళ్ కు  చూపించగా ఆళ్వారులు అనుగ్రహించిన “నాలాయిర దివ్యప్రబంధము అనుసంధానము చేసినప్పుడల్లా”                         ఈ “రామానుజ నూత్తందాది” కూడా అనుసంధానము (విన్నపము) చేయమని నంబెరుమాళ్ళే ఆజ్ఞ ఇచ్చారట. ఇంతటి గొప్ప వైభవము కల ఈ “రామానుజ నూత్తందాది” అను గ్రంధము నిత్యము  అనుసంధానం చేయటం వలన పెరుమాళ్ళు సంతోషిస్తారు.    

ఈ  లోకములో  ఉన్నoత కాలo సుఖ సంతోషములు అనుభవించి అనంతరము పరమపదమునుకు చేరి శాశ్వత ఆనందం అనుభవింతురు.
                              అడియైత్తొడర్ న్దెళుమైవర్‌గట్కాయ్,అ‌‌‍‌‍న్ఱుపారదప్పోర్
                             ముడియ ప్పరినెడున్తేర్ విడుమ్ కోనై, ముళుదుణరన్ద
                             అడియర్క అముదం  ఇరామానుశ నెన్నైయాళవన్దు
                             ఇప్పడియి‌ల్  పిఱన్దదు  మత్తిల్లై కారణం పార్తిడిలే.
శరణాగతులైన పాండవులను రక్షించుటకు కురుక్షేత్ర సంగ్రామమున పాండవశత్రువు లెల్లరును రూపుమాసి పోవునట్లుగా అర్జునునకు సారధ్యము గావించి అతనికి గల విజయుడను నామాంతరము సార్థకము గావించినవాడు గదా సర్వ స్వామి శ్రీ కృష్ణుడు. ఈ నీలఘనశ్యాముని స్వరూప స్వభావాదుల నెరిగిన భక్తుల కమృతమువల్లె భోగ్యులైన “రామానుజు” లీభువి నవతరించినది నన్ను కాపాడుటకే కాని వేరు కారణముండి కాదు.

పరమపదనాథుడు, జగత్కారకుడు (సృష్టి,స్ధితి లయములు చేయువాడు) అయిన
ఆ శ్రీమన్నారాయణుడే “రామానుజుల”కు విభూతి ద్వయాన్ని (నిత్య విభూతిని,లీలా విభూతిని) రెండింటికి సంభందించిన అధికారమును అప్పచెప్పటము వలన,“భగవద్రామానుజులు” అనినా, వారి సంబంధీకులు (“రామానుజ” అనే నామమును తలిచేవారు “రామానుజ దాసులము” అని అనుకునేవారు) పెరుమాళ్ళుకు ఇష్టులు.అందుకనే భగవత్ తత్త్వము తెలిసిన  జ్ఞానులు,యతీశ్వరులు,ఆచార్యపురుషులు,భాగవతోత్తములు (పండితులు) “రామానుజుల” సంబంధీకులుగా “రామానుజుల దాసులుగా” వారి నామములు చివరన “రామానుజ” అని "రామానుజ దాసులమని" వారి పేరు చివర చేర్చుకుని భగవంతునికి ప్రీతిపాత్రులు అగుచున్నారు.

పరమపదమునకు “రామానుజ” సంబంధీకులుగా మోక్షమార్గమున పయనిస్తున్నారు…
ఇది ఎలాగంటే విధి రాతని ఎవరూ తప్పించలేరు అని అంటారు కదా అది నిజమే కాని భగవంతుండైన ఆ శ్రీమన్నారాయణుని,ఆయనకు ప్రీతికలవారిని ఆశ్రయిస్తే ఎంతటి విధి రాతనైనా (మన కర్మలను అనుసరించి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సివచ్చినా) తప్పించ్చి ఈ జన్మలోనే ప్రారబ్దమును అనుభవింపచేసి (అనుభవింప చేయవచ్చు చేయకపోవచ్చు అది ఆయన ఇష్టం) నేరుగా పరమపదానికి తీసుకుని వెళ్తాడు.
సకల చరాచరములను సృష్టించే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అయిన శ్రీమన్నారాయణునికి మోక్షమిచ్చుట ఒక లెక్క. 
అందునా ఆ స్వామికిష్టమైన “రామానుజ” సంబంధికుల (“రామానుజ” నామము పలుకువారు) విషయమున వేరే చెప్పనవసరమేముంది.  
          “అయోత్తియిల్ వాళుమ్ శరాశరమ్ ముత్తవుమ్ ఒన్ఱిన్ఱియే నఱ్పాలుక్కుయత్తనన్” 
విలక్షణదేశమైనట్టి అయోధ్య యందు  వాసము చేయునట్టి (నివాసము యున్నటువంటి) చరాచరములన్నింటిని ఒక్కొకటిగా మోక్షము పొందునట్లు చేసెను  అన్నట్లుగా, రామావతారమున  ఆయనయందు ప్రీతి, విశ్వాసము కలవారిని ఆయనను వీడి ఉండలేనని ఆయనతో వస్తానని  అన్నవారందరిని పరమపదమునకు తీసుకువెళ్లినట్టు అలాగే ఈ “రామానుజలయందు” వీరి  దాసులయందు ప్రీతికలవారికందరికి ఇహపర సౌఖ్యములను కలుగజేయును.
      “ శరణమాకుమ్ తనతాళడైన్దార్  కెల్లాంమరణమానాల్ వైకున్దమ్ కొడుక్కుమ్ పిరాన్ ”
శరణువేడిన వారికి దేహమును వదులు సమయమున  శ్రీవైకుంఠమును  ఇచ్చునట్టి ఉపకారకుడు అన్నట్టుగా శ్రీమన్నారాయణుడు, “రామానుజులు” కూడా మనకు ఉపకారకులు.
       “పడముడైయరవిల్ పళ్ళిపయన్ఱవన్  పాతంగాణ నడమినో నమర్ కళుళ్ళీర్”
ఓ బంధువులలారా! ఫణములుగల ఆదిశేషుని  మీద ఆదరముతో పవ్వళించి యున్నవాని యొక్క  శ్రీ పాదములను సేవించుటకై వెళ్ళండి. అన్నట్టుగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించి శాశ్వతానందాన్నిచ్చే శ్రీమన్నారాయణుని శ్రీ పాదాలను ఆశ్రయింప చేయువారు “రామానుజులే”  “రామానుజ నామమే” .
                                విజ్ఞాపనం యదిద మధ్య తు మామకీనమ్
                                 అజ్గీకురుష్వ యతిరాజ దయామ్బురాశే
                                  అజ్ఞోయమాత్మగుణలేశ  వివర్జితశ్చ
                                  తస్మాదనన్యశరణో భవతీతి మత్వా
దయా సముద్రా! యతిరాజా! నాకు చెందిన ఈ విజ్ఞాపనాన్నివీడు అజ్ఞుడు,ఆత్మగుణాలు లేశం కూడా లేనివాడు,అందువల్ల అనన్యశరణ్యుడు అని తలచి నన్ను అంగీకరించు.

ఈ లోకులను ఉద్ధరించుటకే కదా “రామానుజలు” 1000,సంవత్సరముల క్రితం పరమపదమునుండి ఇక్కడికి వేంచేసింది. అందుకే కాబోలు మనల్ని వదిలి వెళ్ళలేక వారి చరమ శరీరాన్ని (పార్థివ దేహాన్ని) ఇక్కడే  ఉంచేసారు  శ్రీరంగంలో ఇప్పటికి మనము ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకోవచ్చు( “రామానుజుల” మూర్తిని దర్శించుకోవచ్చును ) విశేషమేమిటంటే ఇప్పటికి వారి  మూర్తికి నఖములు (గోర్లు) పెరుగుతూ ఉంటాయట, కేశములు (వెంట్రుకలు) పెరుగుతాయట.
 ఇంతటి మహిమాన్వితులు, లోకోపకరకులు అయిన “రామనుజులకు” మంగళమ్.
                                వేదాత్మక ప్రమాణేన సాత్వికై శ్చప్రమాతృభిః౹
                                ప్రమేయేణ సహ శ్రీమాన్ వర్ధతాం యతిశేఖరః౹౹
ఉభయవేదాంతాలనే ప్రమాణములతోను, వాటిలో పారంగతులైన, సాత్వికులైన “ఆళ్వార్లు”, “ఆచార్యులు” అనే ప్రమాతలతోను, అర్చావతారపర్యంతంగా ఉండే ప్రమేయం అయిన భగవానునితోను కైంకర్య సంపద నిండుగా ఉండే యతిరాజులు నిత్యం వర్ధిల్లాలి.

                                  అత్తికిరి యరుళాళర్ అడి పణిన్దోన్ వాషియే
 హస్తిగిరి (కాంచీపురం) లోని “వరదరాజస్వామి” శ్రీచరణములను సేవించిన వానికి మంగళమ్.
                                               
                        శీర్ పెరుమ్బూదూర్ మునివన్ తిరువడిగళ్ వాషియే
  సంపదలు సమృద్ధిగాగల శ్రీపెరుంబూదూర్ లోని ముని అయిన “భగవద్రామానుజుల”  శ్రీచరణములకు  మంగళమ్.
                                        
భగవంతుడిని వదిలి ఉండలేని ఆదిశేషులు భగవంతుడు ఎత్తిన అవతారముల సమయములలో వారు కూడా వేంచేసి  కైంకర్యం చేసుకొన్నట్టుగా  అంటే నిత్య విభూతి యందు, ఈ లీలా విభూతి యందు కూడా స్వామి శ్రీపాదాలను వీడకుండా కైంకర్యములు చేసుకున్నట్టు ఈ జీవులను కూడా ఇక్కడి కైంకర్యమును అలవరచి సుఖ సంతోషములతో ఉండేలా చూసి అనంతరం పరమపదానికి తీసుకొనివెళ్ళి నిత్య సూరులతో సమానముగా స్వామిని సేవించుకొనేలా చేయుటకై ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞగా ఈ లోకములో “భగవద్రామానుజులగా”  అవతరించిరి. 

                          తద్విష్ణోఃపరమం పదం
                                           సదా పశ్యంతి సూరయః   
వ్యాపకుడగు విష్ణువు యొక్క పరమపదమును యెల్లకాలమును నిత్య సూరులు సేవించుచున్నారు 
          అన్నట్లుగా మనము కూడా ఆ పరమపదమున నిత్య కైంకర్యము చేసుకోవాలని
            విష్ణులోక మణి మండప మార్గధాయులు అయిన రామనుజులను ఆశ్రయిద్దాం.
                                     శ్రుత్యగ్రవేద్య నిజదివ్య గుణ స్వరూపః
                                     ప్రత్యక్షతా ముపగత స్త్విహ రంగరాజః౹
                                    వశ్య స్సదా భవతి తే యతిరాజ! తస్మాత్
                                    శక్తః స్వకీయజన పాపవిమోచనే త్వమ్౹౹
యతిరాజా! (రామానుజా!) వేదాంతముల ద్వారా తెలియదగిన దివ్యగుణములను, స్వరూపాన్ని కల్గినవాడు, శ్రీరంగంలో అందరి నేత్రాలకు గోచరుడై, శులభుడై ఉండే శ్రీరంగనాథుడు మీకు అధీనుడు. అందువల్ల మీరు మీ భక్తుల పాపాలను పోగొట్టడంలో సమర్థులు.
                                ఎంబెరుమానార్ దరశనమెన్ఱే ఇదుక్కు౹
                           నమ్బెరుమాళ్ పేరిట్టు నాట్టివైత్తార్౹ అమ్బువియోర్
                                   ఇన్దదరిశనత్తై ఎమ్బెరుమానార్ వళర్త౹
                                               అన్దచ్చెయలఱిగైక్కా౹౹
సర్వ మానవులను తరింపవలెను అను ఉద్దేశ్యముతో “రామానుజులు” ఈ వైష్ణవాసిద్ధాంతమును వృద్ధినొందించి నందున శ్రీరంగనాథుడు .దీనికి “రామానుజ” దర్శన మనియే పేరుంచి దీనిని ప్రచారములోనికి తెచ్చెను. భగవంతుడే మెచ్చుకొని ఇంతటి  గొప్పతనమును కలిగించిన “భగవద్రామానుజులను” వారి ప్రతినిధులు అయిన జీయర్లను ఆశ్రయిద్దాం .సుఖసంతోషములతో ఉజ్జీవిద్దాం.    

                                             రామానుజ నీ చక్కని నామము
                                                 నాదు జిహ్వపై నిలుపవయా
                                                రామానుజ నీ చక్కని నామము
                                                 నిత్యము నే జపియింతునయా
                                                రామానుజ నీ చక్కని నామము
                                                  ధారాకపోషకామాయనయా
                                               రామానుజ నీ చక్కని నామము
                                                 మోక్షమార్గమును చూపునయా
                రామానుజ!  రామానుజ! రామానుజ!
        రామానుజ!  రామానుజ! రామానుజ! 
రామానుజార్య దివ్యజ్ఞా వర్థతామ్ అభివర్థతామ్









  







No comments:

Post a Comment